Agni Puranam in Telugu

అగ్నిపురాణం

అందులో చెప్పబడిన విషయాల వైచిత్ర్యంవల్ల అష్టాదశ పురాణాలలో అగ్ని పురాణానికి చాలా ప్రత్యేకత ఉన్నది. ప్రస్తుతం లభ్యం అవుతున్న అగ్ని పురాణంలో నారద పురాణం చెప్పిన విషయానుక్రమణిక యథాతథంగా ఉన్నది. కానీ నారదపురాణం ‘ఇది ఈశానుకల్పంలో జరిగిన వృత్తాంతం’ అని చెప్పిన విషయం మాత్రం లభ్యం కావటం లేదు. ఇందులోని రెండవ అధ్యాయంలో ‘ప్రాప్తే కల్పేతువారాహే కూర్మరూపో అభవద్ధరిః’ అని చెప్పబడటం చేత ఇది వరాహకల్పవృత్తాంతం అని తెలుసుకొనవచ్చు. పైగా ‘వసిష్ఠాయా అనలో అబ్రవత్’ అనగా వసిష్ఠునిచేత చెప్పబడిన అగ్నివృత్తాంతం కూడా లేదు. బ్రహ్మ మానస పుత్రుడైన మరీచి మహాముని ద్వాదశ వార్షిక సత్రయాగంలో అగ్నికి ధర్మానుష్ఠానాన్ని గురించి చేసిన ఉపదేశం మీద ఆధారపడి ఈ పురాణం ఆరంభం అవుతున్నది. స్కాంద పురాణంలోని శివరహస్య ఖండంలో ఈ పురాణం అగ్నిదేవుని మహాత్మ్య ప్రతిపాదనం ఈ పురాణ ప్రధాన లక్ష్యం అని పేర్కొంటున్నా, ఇలాంటి వృత్తాంతాలు అగ్ని పురాణంలో లేనేలేవు. ప్రస్తుతం అగ్ని పురాణమని, వహ్ని పురాణమని రెండు పురాణాలు లభ్యం అవుతున్నాయి. రెండింటిలో చెప్పబడిన విషయాలలోను కొంత ఐక్యత ఉన్నది. బల్లాల సేనుడు అగ్ని పురాణంలోనివిగా ఉద్ధరించిన కొన్ని శ్లోకాలు ప్రస్తుత అగ్ని పురాణంలో లభ్యం కావటం లేదు. అగ్ని పురాణంలోని చాలా విషయాలు, వహ్ని పురాణంలో కూడా ఉన్నాయి.

దీని వక్త అగ్ని . శ్రోత వశిష్ఠుడు. ఇందులో ఈశానుకల్ప వృత్తాంతం ఉన్నది. ఆధునికులు అగ్ని పురాణాన్ని భారతీయుల సమస్త విజ్ఞానకోశం అంటున్నారు. దీనిని జాగ్రత్తగా పరిశీలిస్తే పురాణాల ముఖ్య ఉద్దేశ్యం భారతీయ విద్యలను జనసామాన్యం చేరువలోనికి తీసుకొనిరావటమే అనిపిస్తుంది. ఇందులోని 383 అధ్యాయాలలో అనేక విషయాలు వివరించటం అశ్చర్యం అనిపిస్తుంది. ఇందులో అవతారతత్త్వంతోపాటు రామాయణ మహాభారత హరివంశ కథలసారం ఇవ్వబడింది. అనేక విధాలైన దేవాలయాల నిర్మాణ కళను వివరించటంతోపాటు విగ్రహ ప్రతిష్ఠ పూజావిధానం మొదలైన వాటిని గురించి విస్తృతంగా వివరించబడింది. నాలుగు ఉపవేదాలు, వేదాంగాలు, తాత్త్విక, దార్శనిక విషయాలు మాత్రమే గాకుండా పశుచికిత్స, ధర్మశాస్త్ర, రాజనీతి, ఆయుర్వేదం మొదలైన శాస్త్రాల విషయాలు ప్రత్యేకంగా వివరించటం జరిగింది. చివరలో కావ్య సౌందర్య విషయాలతోపాటు అలంకార శాస్త్ర విషయాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. ఛందశ్శాస్త్రం 8 అధ్యాయాలలో వివరించబడింది. వ్యాకరణశాస్త్ర క్లుప్తీకరణ చాలా ప్రత్యేకంగా చెప్పబడింది, కౌమార వ్యాకరణం అనే పేరుతో ఒక చిన్న వ్యాకరణము, ఏకాక్షర కోశము, నామలింగానుశాసనము, యోగశాస్త్ర అంగాల వివేచనము అద్వైత వేదాంత సారము ఇందులో సమకూర్చబడ్డాయి. ఈ విధంగా అగ్ని పురాణంలో భారతీయ సాహిత్యము, సంస్కృతులకు సంబంధించిన అన్ని విషయాలు సంక్షిప్త రూపంలో సంకలనం చేయ బడ్డాయి. అందువలననే ‘ఆగ్నేయేహి పురాణే స్మిన్ సర్వావిద్యాః ప్రదర్శితాః” అని చెప్పబడింది. ఇందులో ఆయుర్వేదము, గాంధర్వవేదము, అర్థశాస్త్రంవంటి వేదాంగాలకు సంబంధించిన విషయాల వర్ణన ఉన్నది. ఇందులో పురాణ పంచలక్షణాలతోబాటు హిందూ సంస్కృతి, సాహిత్యాల అన్ని విషయాల వివరణ ఉన్నది.

బ్రహ్మజ్ఞానం తతఃపశ్చాత్ పురాణ శ్రవణే ఫలమ్
ఏతదాగ్నేయకం విప్ర పురాణం ప్రకీర్తితమ్.


ఈ పురాణ శ్రవణం లేక మననం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుందనటంలో అతిశయోక్తి లేదు. ఈ పురాణ రచన క్రీ.శ. 7-11 శతాబ్దాల మధ్య జరిగి ఉండవచ్చు.

దీని సంస్కరణ క్రీ.శ. 13వ శతాబ్దిలో జరిగి ఉండవచ్చు. అగ్ని పురాణంలో అనేక తాంత్రిక అనుష్టాన విధానాలు ప్రతిపాదించబడ్డాయి. వీనిలోని కొన్ని ప్రత్యేక అనుష్టానాలు ఈనాటికి వంగదేశంలో ప్రచారంలో ఉన్నాయి. అందువలన ఇది వంగ దేశంలో రచింపబడి ఉండాలని భావించబడుతున్నది.

అగ్ని పురాణంలో 383 అధ్యాయాలు ఉన్నాయి. అందులో నారద పురాణానుసారం 25,000 శ్లోకాలు, మత్స్య పురాణాను సారం 13,000 శ్లోకాలు ఉండాలి. కానీ వాస్తవంలో నేడు లభ్యం అవుతున్న అగ్నిపురాణంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి.

Download PDF Book

Agni Puranam in Telugu PDF formt. Simple to read Telugu suitable for all ages. Agni puranam is one of the famous Ancient Hindu puranas.

agni-puranam

Download PDF Book

Follow us on Social Media